కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం లో. కొలువున్న భీమేశ్వరాలయం పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా, దక్షిణ కాశీ గా ప్రసిద్ధి చెందింది.
ఈ ఆలయాన్ని సా.శ. 7, 8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. ఈ ఆలయం రెండస్తులుగా ఉంటుంది. మెట్ల మార్గం ద్వారా గర్భగుడి పై స్థాయికి చేరుకుని భీమేశ్వర స్వామి పై భాగాన్ని చూడవచ్చు. ఇక్కడ శివలింగం స్ఫటిక ఆకృతిలో ఉంటుంది. శివలింగం పైభాగంలో నల్లటి చారలు మనకు కనిపిస్తాయి. తెల్లవారుజామున లేత సూర్యకాంతి శివలింగంపై పడుతుంది.
శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. ఈ భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇంద్రేశ్వర, యజ్ఞేశ్వర, సిద్దేశ్వర, యోగీశ్వర, యమేశ్వర, కాళేశ్వర వీరభద్రేశ్వర లింగాలు దర్శనమిస్తాయి.
ఈ ఆలయ ప్రాంగణం లో ఈశాన్యంలో అష్టాదశ శక్తి పీఠాలలో 12వ శక్తిపీఠం అయిన మాణిక్యాంబ ఆలయం కొలువై ఉంది. దేవేరి శ్రీ మాణిక్యంబా అమ్మవారు యావత్భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి.
ఈ భీమేశ్వరుడికి ఎనిమిది దిక్కులలోను ఎనిమిది శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడని విశ్వసించబడుతుంది. వీటిని అష్టలింగములు లేదా అష్ట సోమేశ్వరములు అంటారు.
- తూర్పున కోలంక
- పడమర వెంటూరు
- దక్షిణాన కోటిపల్లి
- ఉత్తరాన వెల్ల
- ఆగ్నేయంలో దంగేరు
- నైరుతిలో కోరుమిల్లి
- వాయువ్యంలో సోమేశ్వరం
- ఈశాన్యాన పెనుమళ్ళ
పర్వదినాలు - ఉత్సవాలు
- ప్రతీ ఏకాదశీ పర్వదినములలో ఏకాంతసేవ, పవళింపుసేవ
- ప్రతీ మాసశివరాత్రి పర్వదినములలో గ్రామోత్సవం
- ప్రతీ కార్తీక పూర్ణిమతో కూడిన క్రృత్తికా నక్షత్రం రోజున జ్వాలాతోరణ మహోత్సవం
- ప్రతీ మార్గశిర శుద్ధ చతుర్ధశి రోజున శ్రీ స్వామివార్ల జన్మ దినోత్సవం
- ప్రతీ ధనుర్మాసంలోనూ క్షేత్రపాలకులు అయిన శ్రీ లక్ష్మీ సమేత శ్రీ నారాయణ స్వామి వార్లకు ధనుర్మాస పూజలు
- ప్రతీ మాఘశుద్ధ ఏకాదశీ ( భీష్మ ఏకాదశి ) రోజున శ్రీ స్వామి వారి, అమ్మవార్లకు దివ్య కల్యాణ మహోత్సవం
- ప్రతీ మహాశివరాత్రి పర్వదినాలలో శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.
- శరన్నవరాత్రులు (దేవీనవరాత్రులు) - ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు జరుగుతాయి
- కార్తీక మాసం ప్రత్యేక ఉత్సవాలు - జ్వాలాతోరణం (కార్తీక పున్నమి నాడు)
- సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవం- మార్గశిరశుద్ధ షష్ఠి నాడు
ఎలా చేరుకోవాలి?
ద్రాక్షారామం గ్రామం ద్వారపూడి - యానాం లను కలిపే 206 రాష్ట్ర రహదారి లో ఉంది. ఇక్కడకు కాకినాడ, రామచంద్రపురం, రాజమహేంద్రవరం ల నుండి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల ద్వారా చేరుకోవచ్చు.
- మండల కేంద్రం - రామచంద్రపురం (6 km)
- జిల్లా కేంద్రం - అమలాపురం (27 km)
- సమీప పట్టణం - రామచంద్రపురం (6 km)
- సమీప బస్ స్టేషన్ - రామచంద్రపురం (6 km)
- సమీప రైల్వే స్టేషన్ - కాకినాడ టౌన్ (31 km)
- సమీప విమానాశ్రయం - రాజమహేంద్రవరం (54 km)
వసతి మరియు భోజన సదుపాయాలు
యాత్రికుల సౌకర్యం కోసం ద్రాక్షారామం లో వసతి గృహం నిర్మించబడింది. అలాగే అన్నదాన సత్రం నిర్మించబడింది. ద్రాక్షారామం లో మరియు సమీపంలోని రామచంద్రపురం పట్టణం లో బడ్జెట్ స్థాయి హోటల్స్, భోజన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. స్టార్ కేటగిరీ వసతి, భోజన సౌకర్యాలు 30 km దూరం లో ఉన్న కాకినాడ లో అందుబాటులో ఉన్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి